ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హీరో బీఎస్-4 ద్విచక్రవాహనాలపై 15 వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. పలు మోటారు సైకిళ్లపై రూ.10వేలు, స్కూటర్లపై రూ.15 వేల డిస్కౌంట్లను అందిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసివేసిన కారణంగా స్టాక్‌ను క్లియర్ చేసుకునే క్రమంలో ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఈ డిస్కౌంట్లను అందించనుంది.
హీరో మోటోకార్ప్ సుమారు రూ. 600 కోట్ల విలువైన 1.5 లక్షల యూనిట్ల బీఎస్-4 వాహనాలను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం భారతదేశ మంతటా వివిధ డీలర్ల వద్ద కనీసం 7లక్షల అమ్ముడుపోని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల విలువ రూ .3,850 కోట్లు. 2020 ఏప్రిల్ 1 నుండి బీఎస్-4 వాహనాల విక్రయాలను, రిజిస్టేషన్లను సుప్రీంకోర్టు 2018లో నిషేధించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమలవుతున్న 21 రోజుల లాక్ డౌన్ కారణంగా బీఎస్-4 వాహనాల విక్రయాలపై సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మరో 10 రోజులు విక్రయించడానికి సుప్రీంకోర్టు మార్చి 27న అనుమతించిన సంగతి తెలిసిందే.