ఎలాగైనా భార‌త్‌కు తీసుకెళ్లండి: గ‌ర్భిణీ వేడుకోలు

దుబాయ్‌: త‌న‌ను ఎలాగైనా స్వ‌దేశానికి పంపించాలంటూ ఓ గ‌ర్భిణీ మ‌హిళ బుధ‌వారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. లాక్‌డౌన్ వ‌ల్ల విమానాలు కూడా ఎగ‌ర‌నందున త‌క్ష‌ణ‌మే భార‌త ప్ర‌భుత్వం త‌న‌కు సాయం చేయాలంటూ వేడుకుంది. కేర‌ళ‌లోని కోజికోడ్‌కు చెందిన మ‌హిళ అతిరా గీతా శ్రీధ‌ర‌న్ దుబాయ్‌లో ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తుంది. ఆమె భ‌ర్త నిర్మాణ రంగంలో ప‌నిచేస్తున్నాడు. ఆ దేశంలో విధించిన‌ లాక్‌డౌన్‌లో ఈ రంగానికి మిన‌హాయింపునివ్వ‌క‌పోవ‌డంతో అత‌నికి క‌నీసం సెల‌వు కూడా దొర‌క‌ట్లేదు. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భిణీ. (హమ్మయ్య!.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు)












అక్క‌డ‌ ఆమెకు సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చూసేవాళ్లు ఎవ‌రూ లేనందున భార‌త్ తీసుకురావాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. జూలైలో డెలివ‌రీ జ‌ర‌గాల్సి ఉన్నందున మే మొద‌టి, రెండు వారాల్లో భార‌త్‌కు వ‌స్తాన‌ని అభ్య‌ర్థించింది. క‌రోనా ప్ర‌బ‌ళుతున్న స‌మ‌యంలో ఆమె త‌న స్వ‌స్థ‌లానికి చేరుకోవ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌నిన పిటిష‌న్‌లో పేర్కొంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఆమెను తీసుకొస్తామ‌ని ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రోవైపు దుబాయ్‌లో నివ‌సిస్తున్న ఇత‌ర కార్మికులు సైతం త‌మ‌ను భార‌త్‌కు తీసుకురావాల‌ని వేడుకుంటున్నారు. (కోవిడ్‌తో ఆకలికేకలు రెట్టింపు)