కర్ణాటక, యశవంతపుర : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన డాక్టర్ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు... చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు చెందిన డాక్టర్ రేవంత్ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల చిన్నారితో పాటు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. రేవంత్ బీరూరులో డెంటల్ క్లినిక్ నడుపుతున్నాడు.
ఈ క్రమంలో బెంగళూరు రాజరాజేశ్వరి నగర జవరేగౌడ లేఔట్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ అయిన హర్షిత (32)కు రేవంత్ వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ హర్షిత తన వద్దకు వచ్చేయాలని రేవంత్‌పై ఒత్తిడి తెచ్చేది. ఈ క్రమంలో కవిత ఈనెల 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్యను ఎవరో హత్య చేశారని కడూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా రేవంత్‌ను అనుమానించలేదు. ఇదిలా ఉంటే గురువారం హత్యకు సంబంధించిన నివేదిక పోలీసులకు చేరింది. అందులో కవితకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లు బయటపడింది. దీంతో రేవంత్‌ను విచారణ చేయాలని అతని ఫోన్‌కాల్స్ లిస్ట్‌ను కూడా తెప్పించారు. దీంతో భయపడిన రేవంత్ శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బండికొప్పలు వద్ద కారు నిలిపి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రేవంత్ హర్షిత (32)కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. రేవంత్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బెంగళూరు ఆర్‌ఆర్ నగర జవరేగౌడ లేఔట్‌లో నివాసం ఉంటున్న హర్షిత కూడా డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివాహేతర సంబంధం ఇలా మూడు ప్రాణాలు తీసి చిన్నారులను అనాథలుగా మార్చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(ఇంట్లోనే శత్రువు)