భైంసాటౌన్(ముథోల్): పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆపత్కాలంలో రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా వెంటనే స్పందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ‘బ్లడ్ డోనర్స్’ పేరటి వాట్సాప్ గ్రూపు ప్రారంభించారు. 300 మంది సభ్యులున్న ఈ గ్రూపులో రక్తం కావాలి అనే సందేశమిస్తే చాలు.. క్షణాల్లో స్పందిస్తూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపు సభ్యుల్లో ఎక్కువ మంది నాలుగు, ఐదుసార్లు రక్తదానం చేసినవారే ఉన్నారు.
భైంసా పట్టణానికి చెందిన దొడ్లోల్ల సురేశ్ స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ముథోల్ నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల నుంచి గర్భిణులు, క్షతగాత్రులు, ఇతర రోగులు భైంసాలోని ఏరియాస్పత్రికి వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో గర్భిణులు, ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి రక్తం అవసరం ఉండడం, స్థానికంగా బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో, రక్తదాతల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. దీంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రక్తం తీసుకురావాల్సి వచ్చేది. ఒకానొక సమయంలో సకాలంలో రక్తం అందక చనిపోయినవారున్నారు.