వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై కొన్ని రోజులుగా ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో.. వర్మ మరోసారి తనదైన శైలిలో ట్రంప్ పర్యటనపై ట్వీట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ నెల 24న ట్రంప్ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అదేరోజు మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ బుధవారం వర్మ సరదాగా ట్వీట్ చేశారు.
‘ఈ కార్యక్రమంలో నాకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పావు కదా.. లక్ష మందే వచ్చారేంటి?’ అని అడిగిన ప్రశ్నకు మోదీ ‘ఇండియన్ 70 రూపాయలకు.. అమెరికా 1 డాలర్ ఎలా సమానమో.. 70 మంది అమెరికన్లకు ఒక గుజరాతీ సమానం’ అని మోదీ సమాధానం ఇచ్చినట్లు వర్మ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వర్మ ట్వీట్‌కు ఫిదా అయిన నెటిజన్లు.. ఫన్నీ మీమ్స్‌తో తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా గతంలో కూడా వర్మ వివిధ అంశాలపై తనదైన శైలిలో ట్వీట్ చేసి నవ్వించిన సంగతి తెలిసిందే.